4 వారాల్లో తేల్చండి

అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 176పై సుప్రీంకోర్టు స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల్లో జీఓ 176 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు గత తీర్పు నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. ఈ రిజర్వేషన్ల వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను నాలుగు వారాల్లోగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.



ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే, న్యాయమూర్తులు జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు కొద్దిరోజుల క్రితం హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వం నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లపై జోక్యానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.